ఆంధ్ర కళాసమితి - పన్వేల్

ANDHRA KALA SAMITHI - PANVEL

Regd. No. F 1626 (Raigad) Public Trust Act - 1950

Plot No 30, Sector -2,
New Panvel,
Navi Mumbai,
Maharashtra.410206

Andhra kala Samithi-Panvel Building
Bammera Pothana
Telugu Talli
Andhra Pradesh Assembly
kakatiya Kala Thoranam, Warangal Fort
Ramappa Temple, Warangal
Sri Venkateswara Temple, Tirupati
Charminar, Hyderabad
Buddha Statue, Hyderabad
Hitech City, Hyderabad

Sri Sri Sri Brahmamgari Kalajnanam (శ్రీశ్రీశ్రీ బ్రహ్మంగారి కాలజ్ఞానం)

తెలుగు నాట బ్రహ్మంగారి గురించి కానీ ఆయన కాలజ్ఞానం గురించి కాని తెలియని వారు లేరనే చెప్పాలి. ఆయన భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళ పత్ర గ్రంధాలలో రచించి భద్రపరిచారు.

ఆయన పూర్వజన్మల వాటి కాలం ఆయన వివరించిన తీరు నమ్మడం సామాన్యులకు కష్టమే. ఆయన తన 175వ ఏట జీవ సమాధి చెందారు. ఆయన తన కుమారునితో చేసిన సమాధి ప్రస్తావనలో తన వయసు సూచించారు. జీవ సమాధి చెందిన తరవాత ఆయన ప్రియ శిష్యుని దుఃఖం నివారణ నిమిత్తం తిరిగి కనిపించి శిష్యునికి కమండలం, దండం, పాదుకలు మరియు ఉంగరం బహూకరించాడు.

గత జన్మ వృత్తాంతం

 • ఒకరోజు సిద్ధయ్య బ్రహ్మంగారితో "స్వామీ! మీరు గతంలో త్రేతా, ద్వాపర యుగంలో కూడా జన్మించానని చెప్పారు. మీ పూర్వ జన్మ వృత్తాంతం నాకు వివరిస్తారా?" అని అడిగాడు. బదులుగా బ్రహ్మంగారు "నా గతజన్మల గురించిన వివరములు రహస్యములే అయినా, నీకు మాత్రం వివరించగలను. అని తన పూర్వ జన్మల గురించి చెప్పడం ప్రారంభించారు.
 • "బ్రహ్మ లోకంలో నేను భైరవుడనే పేరుతో అనేక బ్రహ్మ కల్పాలు రాజ్యపాలన చేసాను. ఆ తరవాత వెండి కొండ మీదకు వెళ్ళి 54 బ్రహ్మ కల్పాలు రాజ్యపాలన చేశాను. అప్పుడే మూడు యోజనాల పొడవైన సింహాసనమును నిర్మించి 290 బ్రహ్మ కల్పాలు విష్ణు సేవ చేశాను. నేను చేసిన సేవలను గుర్తించిన మాధవుడు నాకు 'పంచవిద ముక్తి' అనే వరం ఇచ్చాడు. ఆ తరవాత సిద్ధాంత శిరోమణి ఆనందాశ్రితువు ఆశ్రమం వద్ద అన్ని విద్యలు అభ్యసించి మూడేళ్ల తరవాత అనేక యోగ శాస్త్ర విద్యలను నేర్చుకున్నాను. 12,000 గ్రంధములు పఠించి అందులోని అన్ని మర్మములు గ్రహించాను. వీటి ఫలితంగా నేను అకాల మృత్యువును జయించే శక్తిని సంపాదించాను. ఆ తరవాత నా యోగ బలం వలన దివ్య శరీరం ధరించి మూడు వేల బ్రహ్మకల్పాలు చిరంజీవిగా ఉన్నాను. ఆ తరవాత నా అవతారముల గురించి వివరముగా తెలుపుతున్నాను విను. మొదట అవతారమెత్తి ఆనందాశ్రితులకు శిష్యుడిగా 99,662 బ్రహ్మ కల్పాలు ఉన్నాను, మూడవ అవతారంలో 1,09,00,000 బ్రహ్మ కల్పాలు ఉన్నాను. నాలుగవ అవతారములో 1,00,01,317 కల్పాలు ఉన్నాను. అయిదో అవతారంలో 4కోట్ల పదఞాలుగు లక్షల 55 వేల బ్రహ్మకల్పాలు ఉన్నాను. ఆరవ అవతారంలో ఆరు వందల బ్రహ్మ కల్పాలు ఉన్నాను. ఏడవ అవతారంలో 27,63,03,400 బ్రహ్మ కల్పాలు జీవించాను. ఎనిమిదో అవతారంలో 22,60,000 బ్రహ్మ కల్పాలు ఉన్నాను. పదవ అవతారంలో కనిగిరిలో ఉన్నాను ఆ జన్మలో 70 లక్షల బ్రహ్మ కల్పాలు జీవించాను. ఇప్పుడు బనగాన పల్లెలో వీరప్పయాచార్యుడనై 125 సంవత్సరములు తపసు చేశాను. వీరబ్రహ్మేంద్ర స్వామిగా మొత్తం 175 సంవత్సరములు జీవించి జీవ సమాధి పొందుతాను.

ఇప్పటి వరకు జరిగినవి

 1. నీళ్ళతో దీపాలు వెలిగిస్తారు (విద్యుత్ శక్తి) (నీటితో జనరేటరు)
 2. ఎద్దులు లేకుండానే బళ్లు నడుస్తాయి. (యంత్ర వాహనాలు)
 3. కాశీ పట్నం 40 రోజుల పాటు పాడుబడుతుంది.
 4. ఒక అంబ (వితంతువు) 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది. (ఇందిరా గాంథి)
 5. తెరమీది బొమ్మలు గద్దెలెక్కుతారు. రంగులు చూసి ప్రజలు మోసపోతారు. (చలన చిత్రాలు)
 6. రాచరికాలు,రాజుల పాలనా నశిస్తాయి.(ప్రజా ప్రభుత్వాలు)
 7. ఆకాశాన పక్షి వాహనాలు కూలి అనేకమంది మరణిస్తారు. (విమాన ప్రమాదాలు)
 8. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది.
 9. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి.
 10. హైదరాబాదులో తురకలు హిందువులు ఒకరిని ఒకరు నరుక్కుని చనిపోతారు. (మత కలహాలు)
 11. దేవస్థానాలు పాపాత్ముల వలన నాశనమౌతాయి. దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి.
 12. చిత్రవిచిత్రమైన యంత్రాలు వస్తాయి. కానీ చావుపుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు. సృష్టిని మార్చటానికి అనేక ప్రయత్నాలు చేస్తారు.
 13. రావణ కాష్టాన కల్లోలములు రేగి దేశాన్ని అల్లకల్లోల పరుస్తాయి.(శ్రీలంకలోని తీవ్రవాద పణామాలు)
 14. గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు.(లాల్ బహుదూర్ శాస్త్రి)
 15. కపట యోగులు విపరీతంగా పెరిగి పోతారు. వీరివలన ప్రజలంతా మోసపోతారు.
 16. అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి

కాలజ్ఞానంలోని కొన్ని ముఖ్యమైన సంఘటనలు, ఈ క్రింది వరుస క్రమంలో జరుగవచ్చు:

 1. శ్రీ వీరభోగవసంతరాయల వారు 'విశ్వావసు' నామ సంవత్సరం (1965-1966) లో జన్మించి అశ్వత్థామ, దత్తాత్రేయుల వారు, శ్రీ సనారీ విశ్వేశ్వర స్వామివారు,శ్రీ ఆచార్య నాగార్జునుల వారు, శ్రీ స్వర్ణ అమరలింగేశ్వర స్వామివారు, తదితర సిథ్థపురుషుల వద్ద సమస్త విద్యలు నేర్చి ఆ తరువాత పరమశివుడుని ప్రార్థించి వారిచే 'దేవదత్త' మనే గుఱ్ఱమును, 'శుక' మనే చిలుకను, 'రత్నసారు' అనే ఖడ్గమును, కార్ముకము అనే విల్లును, అక్షయ తూణీరములును, పాశుపత అస్త్రమును (22-11-2007 నాడు), ఆశీస్సులను పొంది, తేది.09-09-2009 నాటినుండి బహిరంగంగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ప్రారంభించుటకు నిర్ణయించుకున్నారు. ఈ తేది నుండి గ్రహముల ఆగ్రహానుగ్రహములు సమస్తం శ్రీ వీరభోగ వసంతరాయలవారి అధీనంలో ఉంటాయి. బ్రహ్మ వ్రాసిన వ్రాత అంతమై, ప్రజలు వారు చేసే పాప పుణ్యాలనుబట్టి పూర్వజన్మ ఫలితాలతో సహా ఈ జన్మఫలితాలు ఎప్పటికప్పుడు అనుభవంలోకి వస్తాయి.
 2. ప్రమాధి నామ సం||(1999-2000) నుండి కరువుకాటకాలు, అతివృష్టి, అనావృష్టి, వ్యాధులు విజృంభిస్తాయి.
 3. తేది 13.04.2000 నాడు శ్రీ వీరభోగ వసంతరాయలు వారు విజయవాడలో ఇన్ద్రకీలాద్రిపై యున్న కనకదుర్గ దేవాలయాన్ని దర్శించారు. (బహుశా ఆ సం.లోనే వివాహము అయివుంటుంది).
 4. అంతర్గత విస్ఫోటనముల వల్ల గానీ, తీవ్రవాదుల దాడుల వల్ల గానీ హైదరాబాదుకు, అణుసంస్ధలకు /రక్షణ సంస్ధలకు ప్రమాదము. ఏ అణుదాడి/అణుప్రేలుడు (అంతర్గత) ఐనా కర్కాటక మకర సంక్రమణముల మధ్య జరుగుతుంది. (2002 నుండి జరిగిన సంఘటనలు గమనార్హం). చావగా మిగిలిన వాళ్ళు రేగడి మట్టిలో చింతపండు కలుపుకుని బ్రతుక వలసి వస్తుంది, ఆచార్యా నాగార్జునుల వారు, ఆయన శిష్యుడు మందులు ఇచ్చి కాపాడుతారు.
 5. సం.1987 నుండి ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతాయి. రాబోయే సునామీ వల్ల దక్షిణేశ్వరము నుండి (కలకత్తా) శ్రీలంక దాకా సముద్రము 80 మైళ్ళు వెనుకకు వెళ్ళుతుంది. తద్వారా, కోణార్క వద్ద సూర్యుని రధసారధి అయిన అనూరుని దేవాలయం, విశాఖపట్నం వద్ద వైశాఖేశ్వరుని దేవాలయం, మోటుపల్లి వద్ద భద్రకాళీ సమేత వీరభద్ర దేవాలయం, శ్రీహరికోట వద్ద విగ్రహరూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుల దేవాలయం, మొదలగు ఎన్నో దేవాలయాలు బైటపడతాయి.
 6. తేది 09-04-2005 నుండే శ్రీ వీరభోగవసంతరాయలవారు సశరీరంగా దర్శనమిస్తున్నారు. తేది.04/10/2006 న మరియూ 04/09/2009 న శ్రీ స్వామివారు మహానంది సందర్శించారు. 09-09-09 కి ముందు శ్రీ వీరభోగవసంతరాయలవారు మాచర్లలోని చెన్నకేశవస్వామి దేవాలయము, యాగంటి, శ్రీకాళహస్తి, కుంభకోణం దేవాలయములు రోజుకు మూడుసార్లు దర్శించారు. ఇప్పుడు రోజుకు ఒక్కసారి మాత్రమే దర్శిస్తున్నారు. ఏ రోజున వారి సందర్శన ఆగుతుందో ఆ రోజున ఆయా దేవాలయములు దెబ్బతింటాయి లేదా కూలిపోతాయి.
 7. కృష్ణా గోదావరి నదులమధ్య రక్తం ఏఱులై పారుతుంది (ప్రత్యేక రాష్ట్రం కోసం, నీటికోసం, మతకల్లోలాలవల్ల).
 8. తేది.26-12-2011 న శ్రీ వీరభోగవసంతరాయలవారు సాధారణ పరిపాలకులుగా పట్టాభిషిక్తులౌతారు.
 9. మూడవ ప్రపంచ యుధ్ధం 2046లో గాని, ఆ తర్వాత వచ్చే మకర సంక్రాంతి రోజు (గురు గ్రహము కుంభరాశిలో ఉండగా) అంతమవుతుంది కాబట్టి 2012లో కలియుగాంతం అవుతుందని అనుకోవటం అర్ధరహితం. 'నందన' నామ సంవత్సరం(2012-13)లో భయంకర ఉత్పాతములవల్ల లక్షలాది జనం నశిస్తారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో తెలిపారు. భగవంతుని రాక ఊహించి, గ్రహములు, ఋతువులు గతి తప్పబోతుండటం గమనించి, మాయన్ కేలండర్ వ్రాసినవారు పంచాంగ గణితమును అక్కడితో ఆపివుంటారు.(మాయన్ కేలండర్ వ్రాసినవారు మయబ్రహ్మ వారసులని ప్రతీతి).
 10. హస్త(12/09 నుండి 09/11 వరకు), చిత్త(09/11 నుండి 05/12 వరకు), స్వాతి నక్షత్ర 'శని' సంచారంవల్ల అతివృష్టి, అనావృష్టి సంభవిస్తుంది. ప్రళయాలవల్ల కోట్లాది మంది మరణిస్తారు.
 11. కంచి, శృంగేరి, పుష్పగిరిలలో అనేక వింతలు పుట్టును. ఆ పీఠములకు గడ్డు కాలం. పీఠాధిపత్యములు విశ్వబ్రాహ్మణులకు తిరిగి చేరును.
 12. శ్రీశైలములో పరుసువేధి (ఇనుము మొదలగువాటిని బంగారంగా మార్చునది) దొరికి బ్రహ్మంగారి మఠం చేరుతుంది.
 13. ఉదయగిరి పర్వతము మీద సంజీవని దొరుకుతుంది.
 14. నందన(2012-2013)లో శ్రీశైల మల్లిఖార్జునుని గుడిలో పొగ, మంటలు వచ్చును. శ్రీశైల మల్లిఖార్జునుడు సాక్షాత్కారముగా ప్రజలతో మాట్లాడును. శ్రీశైల భ్రమరాంబ గుడిలోకి ఒక మొసలి వచ్చి 8 దినములుండి మేకపోతువలె అరచి మాయమగును. శివుని కంట నీరు కారును. బసవేశ్వరుడు ఱంకెవేసి కాలుదువ్వును. పుట్లకంబము మీద ప్రతిమ మాట్లాడును. కాలభైరవుడు మంత్రములు చదువును.
 15. విజయ నామ సంవత్సరము(2013-14)లో కోట్లమంది మరణిస్తారు.
 16. శ్రీస్వామివారి సైన్యంకోసం లక్షలాది గుఱ్ఱాలు యాగంటి గుహలనుండి వస్తాయి.
 17. కంచి కామాక్షమ్మ ఉగ్రము వల్ల దక్షిణదేశము దొరలు, ప్రజలు నష్టమౌదురు. రామేశ్వరము వద్ద భయంకరమైన యుధ్ధం.
 18. గుళ్ళలో దేవుళ్ళకు మూర్తిమంతములు వచ్చి ఊరూరా నాట్యమాడును. కంచి కామాక్షి గిఱ్ఱున తిరుగును. బిళం కామాక్షమ్మ కండలు కక్కును. గండకీ నదిలో సాలగ్రామములు నాట్యమాడును. వినాయకుడు వలవలా ఏడ్చును. దేవతలు సాక్షాత్కారముగ ప్రజలతో మాట్లాడెదరు.
 19. వినాయకుడు ఊరూరా తిరిగి వేదమంత్రములు చదువును.
 20. తామే వీరభోగవసంతరాయలమని చాలామంది దొంగ సాధువులు వస్తారు.
 21. సూర్యనంది భూకంపంలో నేలమట్టమౌతుంది.
 22. యాగంటి, శ్రీశైలం, కుంభకోణంలలో గోవధ, మతకలహాలు, వేలాదిమంది బలి.
 23. క్రోధి నామ సం.(2024-25)లో భారతదేశానికి యుధ్ధం. ఢిల్లీ పై బాంబుల వర్షం. దేశ రాజథాని ఢిల్లీనుండి ఆనెగొందికి మారుతుంది. అదే సంవత్సరం లో నెల్లూరు నీటమయమౌతుంది.
 24. కాశీ విశ్వనాథుని దేవాలయము 40 రోజులు మూతపడుతుంది. శ్రీ కాళహస్తి, కుమారస్వామి, తిరుమల దేవాలయములు వారం రోజులు మూతపడుతయి. 120 దివ్య దేవాలయములు హిందూయేతర శక్తులచే ధ్వంసము చేయబడుతాయి. ఆ తర్వాత తిరుమల వన్యమృగములకు ఆలవాలమౌతుంది. తిరుమల వేంకటేశ్వర, కాళహస్తి, విజయవాడ కనకదుర్గ మూలవిరాట్ విగ్రహాలు కందిమల్లాయపల్లె చేరుతాయి.
 25. కృష్ణానది వరదలతో అనకట్టలు, 14 నగరాలు కొట్టుకుపోతాయి. కృష్ణ నీరు కనకదుర్గ ముక్కుపోగు అంటుతుంది.
 26. భారతదేశ ఆర్ధిక రాజధానిగా కందిమల్లాయపల్లె విలసిల్లుతుంది.
 27. కంచికి పడమట కామధేనువు జన్మిస్తుంది.
 28. నవనారసింహ క్షేత్రాలు, యాగంటి, ఆలంపూర్, బెల్లంకొండ, శ్రీశైలంలలో ఉన్న మహానిధులను తీస్తారు.
 29. బాపల పంచాంగములు తలక్రిందులవును. వారు చెప్పే భవిష్యత్తు జరుగక పోవును.
 30. ఆఱు విచిత్ర వ్యాధులు లక్షలాది మందిని కబళిస్తాయి.
 31. కావేరీ తీరం వెంబడి కలహాలతో లక్షలాదిమంది మరణం.
 32. భయంకరమైన తుఫానులు, వరదలవల్ల పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ లలో కోట్లాదిమంది దుర్మరణం. భూకంపంవల్ల కలకత్తా నగరం దెబ్బతింటుంది.
 33. ఒక వైశాఖ అమావాస్య నాడు విచిత్ర వ్యాదులతో అనేకమంది హతమౌతారు (బహుశా జీవ, రసాయన ఆయుధముల వల్ల కావచ్చు)
 34. మక్కా మసీదు లో ఒక పంది ఉద్భవమై, ముస్లిములచే తరుమబడుచూ చివరికి విజయవాడ చేరుతుంది. అప్పుడు జరిగే కలహాలవల్ల లక్షలాది మంది మరణిస్తారు.
 35. 'శని' సంచారం - మీనరాశిలో ఉండగా మ్లేఛ్ఛులకు హాని, వృషభరాశిలొ ఉండగా ఈశాన్య దిశ నుండి వచ్చే విషపుగాలి వల్ల మరణాలు, మిధున రాశిలొ ఉండగా పాపులలో ఎక్కువమంది మరణిస్తారు (తేది.29-03-2025 నుండి 10 సంవత్సరములు పైబడి).
 36. ఒక తోక చుక్క వల్ల భూభ్రమణములో మార్పువస్తుంది. సూర్యుడు వణుకుతున్నట్టు కన్పిస్తాడు. తేది.02-08-2027 (సూర్యగ్రహణం) నాడు, సూర్యునిలో సూర్యనారాయణ స్వామి దర్శనమిస్తాడు. ఇంకో సందర్భంలో సూర్యునిలో విష్ణు మూర్తి దర్శనమిస్తాడు. ఇంకో తోక చుక్క 33 రోజులు కన్పిస్తుంది.
 37. తేది.15-03-2035 నాడు శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంతరాయలవారు తమ విశ్వరూపం చూపిస్తారు. తేది.30/03/2035 నాడు శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంతరాయలవారు తన సైన్యంతొ మహాసంగ్రామానికి బయలుదేరుతారు. ఆనంద(2034-35), రాక్షస(2035-36) నామ సంవత్సరములలో పశ్చిమ దేశాలలో కోట్లాదిమంది హతమౌతారు, ఈ సమయంలోనే కలియుగధర్మం నాశనమౌతుంది.
 38. దాదాపు 400 సంవత్సరముల క్రితం శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారిచే బనగానపల్లెలో చింతచెట్టు క్రింద భద్రపరచబడ్డ కాలజ్ఞాన తాళప్రతులు తేది.7/8-06-2036 నాడు శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంతరాయలవారిచే తీయబడి బహిరంగపరచ బడతాయి. ఆనాటి నుండి, వ్యక్తిగత, ప్రపంచ దేశాల భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి సవరణలు లేకుండా కాలజ్ఞానములో వ్రాయబడినట్లు యధాతధంగా జరుగుతాయి.
 39. ప్రపంచవ్యాప్తంగా రెండు మతాల మధ్య యుద్దంవలన పింగళ (2037-2038), కాళయుక్తి (2038-39) మరియు రౌద్రి(2040-41) లలో కోట్లాదిమంది హతమౌతారు.
 40. కులాంతర, మతాంతర వివాహాలు సర్వసామాన్యం అవుతాయి.
 41. ఉత్తరాయణమందు ఉత్తరభారత దేశస్తులు దక్షిణ భారతావనికి తరలివస్తారు. అప్పుడు జరిగే కలహాలవల్ల కోట్లాదిమంది హతం.
 42. తేది.24-05-2039 నుండి 21-06-2039 మధ్యలో వచ్చే భయంకర భూకంపంవల్ల అద్దంకి నేల మట్టమౌతుంది.
 43. క్రీ.శ.2040లో 40 రోజులపాటు కాశీ వద్ద గంగానదిలో నీరు ఉండదు.
 44. పండ్రెండు రోజులు గోదావరిలో చుక్కనీరు ఉండదు. 13వరోజున భయంకరమైన వరదలు వస్తాయి.
 45. తేది.15/16-02-2041(రౌద్రి,మాఘ పౌర్ణమి)నాడు ఒక్కసారిగా ఏడు కోట్లమంది దుర్మరణం పాలౌతారు.
 46. తేది 26/27-11-2044(రక్తాక్షి,మార్గశిర శుధ్ధ సప్తమి)నాడు, చెన్నపట్నం (మద్రాసు) లో, ఏడేండ్ల బ్రాహ్మణ బాలికకు నాలుగు చేతులు, మూడు కాళ్ళు, నెత్తిన కొమ్ము గల ఒక మగ శిశువు జన్మిస్తాడు. ఆ శిశువు 22 రోజులు జీవించి 23వ రోజున మరణించబోయేముందు, శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంతరాయల వారికి కలి పురుషుడికి మధ్య జరగబోయే మహాయుధ్ధం (ది ఆర్మగెడ్డాన్) గురించి ప్రకటన చేసి మరణిస్తాడు. ఈ యుధ్ధం 19-01-2045 నుండి 16-02-2045 మధ్య మొదలౌతుంది. యుధ్ధాలు పరిసమాప్తి క్రీ.శ. 2060 తో అవుతాయి. ప్రళయాలు క్రీ.శ.2066 దాక కొనసాగుతాయి.
 47. అమెరికాలో ఒక నగరం భూకంపంతో నేలమట్టమౌతుంది. ఆ విపత్తునుండి ఐదు కుటుంబాలు మాత్రమే బ్రతికి బట్టకడతాయి. ఇండో-మయా సంస్కృతి తిరిగి పునరుజ్జీవనమౌతుంది.
 48. గోపురము కూలి కుంభుని (కుంభకోణం) రూపు మారుతుంది.
 49. శైవులు వైష్ణవుల మధ్య కలహాలు. బ్రతుకు దుర్భరమై 1,11,000 మంది బ్రహ్మంగారి జీవ సమాధి వద్ద గండకత్తెరలతో తలలు తెగకోసుకుని ఆత్మాహుతి చేసుకుంటారు. ఏఱులై పాఱిన ఆ రక్తం బ్రహ్మంగారి జీవసమాధిని తాకుతుంది. జీవసమాధిని పగులగొట్టుకుని బైటకు వచ్చిన బ్రహ్మంగారు వారిని కాపాడుతారు.
 50. అమావాస్యనాడు, ఉదయగిరి పర్వతముమీద, చక్రాంకితుడైన శ్రీమహావిష్ణువు దర్శనమిస్తాడు. సుదర్శన చక్రమును చూసి ప్రజలు ఆ రోజు చంద్రగ్రహణమని భ్రమపడతారు.
 51. క్షిపణి, అణుదాడిలో హంపి (కర్నాటక) దెబ్బతింటుంది.
 52. మాయాజంగాలు (రోబోట్ సైనికులు) వస్తారు.
 53. వెంపలి చెట్లకు నిచ్చెనలు వేసుకుని ఎక్కే ప్రమాణముగల మనుషులు పుడతారు.
 54. ఊరూర పొలిమేర్ల వద్ద తెల్ల కాకులు చేరి ఏడుస్తాయి.
 55. వాలి,సుగ్రీవుల ఖజానా వెలికి తీస్తారు. హనుమద్రామాయణము వెలుగులోకి వస్తుంది.
 56. నాస్తికత్వము ప్రబలుతుంది. వావివరుసలు మరచి ప్రవర్తిస్తారు. ఒకరియాలు మరొకరి పాలగును.
 57. ఐదేండ్ల నాగయ్య వేదాలు చదువుతాడు. ఇంకొక బాలుడు ప్రజలకు భవిష్యత్తు చెబుతాడు.
 58. భారతదేశం ముక్కలౌతుంది. వింధ్య పర్వతముల నుండి సేతువు (రామేశ్వరము) మధ్య ప్రదేశము, శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంతరాయల వారి సహాధ్యాయి మరియు దళపతియైన ఒక వీరుని పరిపాలనలో ఉంటుంది (సామంత రాజ్యముగా).
 59. వేంకటేశ్వరుని కుడిభుజము అదురును, విగ్రహము పగుళ్ళిస్తుంది, తిరుమలలో భూకంపము వస్తుంది. తిరుమలకు వెళ్ళే రహదారులన్నీ మూసుకు పోతాయి.
 60. పుష్యమాసములో మ్లేఛ్ఛదేశాలకు హాని.
 61. తేది.26-08-2054(భావ,శ్రావణ,బహుళ అష్టమి) నాడు, నదీనదములు పొంగి పల్లెలు, పట్నాలు దెబ్బతింటాయి.
 62. జులై-ఆగష్టు,2055 మధ్య ఒక ఆదివారమునాడు, తిరునల్వేలి వద్ద పండుగ జరుగుతూండగా, అకస్మాత్తుగ వరదలొచ్చి వేలకొద్దీ జనం దుర్మరణం పాలౌతారు.
 63. ధాత(2056-57)నామ సంవత్సరము వచ్చేప్పటికి వైశ్యులలో 25 గోత్రాలవారు మాత్రమే మిగులుతారు.
 64. తేది.03-02-2058(ఈశ్వర,మాఘ,శు.దశమి) నాటికి అన్ని దేశాలు శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంత రాయలవారి వశమౌతాయి. ఆ తేది నుండి సమస్త భూమండలాన్నీ శ్రీశ్రీశ్రీ స్వామివారు 108 సంవత్సరములు పరిపాలిస్తారు. శ్రీవారి వారసులు వెయ్యి ఏండ్లు పరిపాలిస్తారు.
 65. బహుధాన్య(2058-59)లో 25 పట్టణాలలో రక్తపాతం. అంతర్గత కలహాలు, విపత్తులు.
 66. పార్ధివ(2065-66)లో కర్నూలుకు ఉత్తరాన ఒక దేవాలయములో వున్న వేపచెట్టుకు నెల రోజులు పూజ చేస్తారు. ఆ తర్వాత ఆ చెట్టునుండి వచ్చే విషపు గాలివల్ల వేలాదిమంది మరణిస్తారు.
 67. నైతిక విలువలు మృగ్యమౌతాయి. విశృంఖలత పెరుగుతుంది.
 68. గోల్కొండ వద్ద గోవిందాపురములో ఒక ఆవు మనిషికి జన్మనిస్తుంది.
 69. బ్రాహ్మణులు సేవకా వృత్తితో జీవిస్తారు.
 70. విశ్వ బ్రాహ్మణులతో వచ్చిన ఒక వ్యాజ్యములో బ్రాహ్మణులు ఓడిపోతారు.
 71. వన్యజీవులు ఊళ్ళ మీద పడి భీభత్సం సృష్టిస్తాయి.
 72. రెండు బంగారు హంసలు ఊరూరా తిరుగుతాయి. వాటిని పట్టుకోవాలని చూసిన వారు అంధులౌతారు.
 73. ఏనుగంత సైజులో ఉన్న ఎఱ్ఱ చీమలు భూమిమీద తిరుగుతాయి.
 74. పంది కడుపున ఏనుగు జన్మిస్తుంది.
 75. కొండపగిలి నిలువ నీడ లేక కనకదుర్గ కందిమల్లాయపల్లె చేరుతుంది.
 76. అంగడిలో సరస్వతిని అమ్ముతారు.
 77. సముద్రములు కలుషితమై జలచరములు చాలా మటుకు నశిస్తాయి.
 78. అహోబిళములోనున్న ఉక్కు స్తంభమునకు సన్నజాజులు పూస్తాయి.
 79. పరుశురాములవారి లేక ఆచార్య నాగార్జునులవారి లేక సనారీవారి లేక సిధ్ధపురుషుల లేక పై అందరి శిష్యుడైన వ్యక్తి ఈ దేశ అప్పులు తీర్చి, నదీనదములను అనుసంధానము చేసి సస్యశ్యామలము చేస్తాడు.
 80. మూడవ ప్రపంచయుద్ధం ముగిసేనాటికి ఏడు ఊర్లకు ఒక ఊరు మిగులుతుంది.
 81. తేది.09-04-2005(ఉగాది,పార్ధివ)నుండే శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంతరాయల వారు తుది తీర్పులు ఇవ్వడం మొదలుబెట్టినారు. అవశ్య మనుభోక్తవ్యమ్ కృతంకర్మశుభాశుభం.
 82. కాలజ్ఞానం గోవింద వాక్యము 19 ప్రకారము శ్రీ అల్లూరి సీతారామరాజు (శ్రీ అల్లూరి శ్రీరామ రాజు)బ్రిటీషు వారిచే చంపబడలేదు. అదృశ్యుడైనట్లు మాత్రమే వుంది.

హైదరాబాదు పర్యటన

హైదరాబాదు నవాబు బ్రహ్మంగారిని గురించి తెలుసుకొని ఆయన కొరకు కబురు పంపగా బ్రహ్మంగారు నవాబు వద్దకు వెళ్ళాడు. ముందుగా నవాబు ఆయనతో 'మీరు జ్ఞాని అయినా దైవాంశ సంభూతుడుగా నమ్మలేనని ఏదైనా మహిమ చూపితే విశ్వసించగలనని 'అని పలికాడు. బ్రహ్మంగారు వెంటనే ఒక గిన్నెలో నీళ్ళు తెప్పించమని కోరాడు. సేవకుడు తీసుకువచ్చిన నీటితో దీపం వెలిగించాడు. అది చూసిన నవాబు విశ్వాసం కుదిరిందని జ్ఞానబోధ చేయమని కోరాడు.నవాబు కోరికపై బ్రహ్మంగారు జ్ఞానబోధ చేసారు.

బ్రహ్మంగారు తాను భవిష్యత్ లో తిరిగి జన్మించి రాబోయే విషయాన్ని సూచించారు.

 1. నేను శ్రీ వీరభోజ్యుడినై ఈ ప్రపంచంలో ఉద్భవిస్తాను. కలియుగం 5000 సంవత్సరములు గడిచిన తరవాత దుష్ట శిక్షణ శిష్ట రక్షనార్ధం వస్తాను. నేను వచ్చే ముందు సంభవించే పరిణామాలు విను.
 2. ఉప్పుకొడూరులో ఊరచెరువులో ఉత్పాతాలు పుడతాయి. నిజాయితీతో వ్యాపారం చేసే వర్తకులు క్షీణించి పోతారు.
 3. 14 నగరాలను జల ప్రవాహాలు ముంచెత్తుతాయి. నేను రావటానికి ఇది ప్రబల నిదర్శనం.
 4. నాలుగు వర్ణాల వారు గతి తప్పి నడుస్తారు. దేశంలో పెద్ద పొగ మేఘం కమ్ముకుంటుంది. ప్రజలు దానిలో చిక్కుకుని మరణిస్తారు.
 5. 5972 ధాతు నామ సంవత్సరాన మాఘ శుద్ధ బుధవారం రోజున పట్ట పగలే 18 పట్టణాలు దోపిడీకి గురౌతాయి.
 6. కోటిదూపాటిలో కొచ్చర్లకోటలో కోడి మాట్లాడుతుంది. జనులలో అత్యధికులు ఇచ్చిన సొమ్ము దిగ మ్రింగి అబద్దాలాడి బాకీలు ఎగగొడతారు.
 7. కోమటి కులంలో 25 గోత్రాల వారు మాత్రం మిగిలి ఉంటారు. ఉత్తర దేశంలో ఉత్తమ భేరీ కోమటి మహాత్ముడై నిలుస్తాడు. ఆ కోమటిని ప్రపంచమంతా కీర్తిస్తారు.
 8. మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది.
 9. పట్ట పగలు ఆకాశంలో నుండి పిడుగుల వాన పడి నిప్పుల వాన కురుస్తుంది. అందులో కొందరు మరణిస్తారు.
 10. పంది కడుపున ఏనుగు పుడుతుంది. మేక కడుపున ఐదు తలల మేకపోతు పుడుతుంది.
 11. బనగాన పల్లెలో కాలజ్ఞానం పాతర మీద వేపచెట్టుకు చేమంతిపూలు పూస్తాయి.
 12. గుణవంతులందరూ బనగానపల్లె చేరుకుంటారు. బనగాన పల్లె నవాబు కొంతకాలం మాత్రమే పాలన చేస్తాడు. ఆ తరవాత బనగాన పల్లెను ఇతరరాజులు స్వాధీనపరచుకుంటారు.
 13. అద్దంకి నాంచారమ్మ ముందుగా మాట్లాడుతుంది.అందువల్ల ఎందరో నష్టపోతారు.
 14. గోలుకొండ నుంచి ఇద్దరు పిల్లలు పట్టణం ఏలుతారు.
 15. మహానంది మరుగున మహిమలు పుడతాయి.
 16. నేను రాబోయే ముందు ఒక చిత్రం జరుగుతుంది. దానిని గుర్తించిన వారిని నేను రక్షిస్తాను. నాలుగు నిలువుల ఎత్తుగల ఆజానుబాహువులు మేమే వీరభోజ వసంతరాయలమని చెబుతారు. నిజమైన భక్తులు ఈ మాటను నమ్మరు. మూఢులు మాత్రం నమ్ముతారు.
 17. మరొక విచిత్రం పుడుతుంది. వీపున వింజామరలు అరికాలున తామరపద్మం కలిగినవారు వస్తారు. వారిని చూసి నేనని భ్రమపడవద్దు. నారాకకు గుర్తు ఏమిటంటే కందిమల్లయ పల్లెలో నవరత్న మండపం కడతారు. ఆ పల్లెపెరిగి పట్టణంగా మారుతుంది.
 18. కంచి కామాక్షమ్మ కన్నులవెంట నీరు కారుతుంది. ఈ సంఘటన తరవాత వందలాది మంది మరణిస్తారు.
 19. ఆవు కడుపులోని దూడ అదేవిధంగా బయటకు కనిపిస్తుంది.
 20. పిల్లలు లేని స్త్రీలకు పిల్లలు పుడతారు.
 21. కృష్ణ గోదావరుల మధ్య మహాదేవుడను పేర శైవుడు జన్మించి మతబేధం లేక గుడులూ గోపురాలు నిర్మించి పేరు ప్రఖ్యాతులు పొందుతాడు. ఊరూరా గ్రామ దేవతలు ఊగిసలాడతారు.
 22. కాశీ కుంభకోణ గోకర్ణ క్షేత్రాల మహిమలు తగ్గి పోతాయి. కంచి మహత్యం మాత్రం పెరుగుతుంది.
 23. ఆనంద నామ సంవత్సరాలు పదమూడు గడిచేవరకూ ఈ నిదర్శనాలు కనిపిస్తుంటాయి.
 24. పతివ్రతలు పతితలౌతారు. వావి వరసలు పాటించకుండా ప్రవర్తిస్తారు. ఆచారాలన్నీ సమసి పోతాయి.
 25. రాయలవారి సింహాసనం కంపిస్తుంది. కురుమ సంతతి రాజులందరినీ జయించి దక్షిణంగా బోయి రామేశ్వరం దిక్కున రాయల దళాలను తరిమి యుద్ధాలు చేసి నర్మదానదిలో కత్తులు కడిగి కాశీకి వచ్చి రాయల తల చూస్తారు. ఈ సమయంలో హస్థినాపురిలో మహామారి అనేశక్తి పుడుతుంది. రామేశ్వరం వరకు ప్రజలను నాశనం చేస్తుంది. రాయలు విజయనగరం పాలించే సమయంలో గజపతులతో పోరు జరుగుతుంది.
 26. శ్రీశైల క్షేత్రాన కల్లు, చేపలు అమ్ముతారు. వేశ్యాగృహాలు వెలుస్తాయి. మందుమాకులకు లొంగని వ్యాధులు ప్రబలుతాయి. స్త్రీ పురుషులంతా దురాచార పరులౌతారు. స్త్రీలు భర్తలను దూషిస్తారు.
 27. ఢిల్లీ ప్రభువు నశించిపోతాడు.
 28. వైష్ణవ మతం పైకి వస్తుంది. శైవ మతం తగ్గి పోతుంది. నిప్పుల వాన కురుస్తుంది. గుండ్లు తేలుతాయి. బెండ్లు మునుగుతాయి. చివరకు శివశక్తి అంతా లేకుండా పోతుంది.
 29. విజయనగరాన కోటలో రాయల సింహాసనం బయట పడుతుంది. ఇందుకు గుర్తుగా గ్రామంలో రాతి విగ్రహాలు ఊగిసలాడతాయి. అప్పుడు బిజ్జల రాయుని కొలువులో రాయ సింహాసనం బయట పడుతుంది.

ఇవి కూడా చూడండి

 • శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర
 • శ్రీ బ్రహ్మంగారి మఠం
 • శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర - తెలుగు సినిమా

మూలాలు (Sources)

 • కాలజ్ఞానం వివరంగా ఇక్కడ చూడండి
 • వీరబ్రహ్మం గారి మీద ఆంగ్ల వ్యాసం
 • కన్నేకంటి రాజమల్లాచారి, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తెలుగు విశ్వ విద్యాలయం(1990)
 • Veerabrahmam: India's Nostradamus saint, రచయిత: ఆర్. ఎన్. పిళ్ళై, ISBN 8170172799, ప్రచురణ 1991, అభినవ్ పబ్లికేషన్స్
 • ఆటా వారి వెబ్ సైటు
 • వీరబ్రహ్మంగారి మీద ఆర్కైవ్.ఆర్గ్ సైటులో లభ్యమౌతున్న పుస్తకం
 • http://www.new.dli.ernet.in/scripts/FullindexDefault.htm?path1=/data/upload/0000/170
 • http://www.teluguone.com/devotional/subpages/kalagnanam-55.html
 • Audio: http://sandeepnadendla.com/hanuman.aspx